దశలవారీ మద్యనిషేధం కోసం కసరత్తు 

దశలవారీ మద్యనిషేధం కోసం కసరత్తు 


 


అమరావతి : దశలవారీగా మద్య నిషేధం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించడంతోపాటు మద్యం దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా కొత్తగా మార్గదర్శకాలను జారీచేసింది. బెల్టుషాపుల నిర్మూలన, నాటుసారా తయారీ నిరోధించే బాధ్యతను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులకు అప్పగించింది.



వైసీపీ అధికారంలో వస్తే దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ ఎన్నికలకు ముందు హామి ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ మద్యపాన నిషేధంపై దృష్టిసారించారు. అందులో భాగంగా గ్రామాల్లో బెల్టు దుకాణాలు లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు.


 


అంతేకాకుండా మద్యం దుకాణాలకు ఈ నెలాఖరు నాటికి లైసెన్సుల గడువు ముగుస్తుంది కాబట్టి, కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చే వం"కూ ఎంఆర్టీ ఉల్లంఘన జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడైనా బెల్టుషాపులు నడుస్తున్నట్టు తన దృష్టికి వస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.



దీంతో పాటు ఎస్ఐ అంతకంటే పైస్థాయి అధికారులు తప్పనిసగా వారంలో ఒకరోజు ఒక గ్రామంలో రాత్రిపూట బస చేయాలని ఆదేశించింది. మద్యం వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రతి దుకాణం వద్ద ధరల పట్టికను ప్రదర్శించడంతోపాటు అధికంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్ ను కూడా అందులో పేర్కొనాలని స్పష్టం చేసింది. భవిష్యత్తు కార్యాచరణపై ఎక్కడిక్కడ జిల్లా స్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.



ప్రధానంగా గ్రామాలతోపాటు నగర శివారు . ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బెల్టు షాపులు పేరుతో అనధికార విక్రయాలు జరుగుతున్నాయి. ఈ తరహా బెల్టుషాపులు ఒక్కో జిల్లా పరిధిలో సుమారు ఐదు వేల వరకూ వుంటాయని అంచనా. ఇదిలావుండగా మద్యం వ్యాపారులు కూడా ఆదాయాన్ని పెంచుకునేందుకు అధిక ధరలకు విక్రయాలు జరపడం, గ్రామాల్లో బెల్టు దుకాణాలను ప్రోత్సహించడం చేస్తూ వస్తున్నారు.



తాజాగా మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులకు తెలిసేలా అన్ని రకాల మద్యం ధరలను పట్టిక రూపంలో తయారుచేసి ప్రదర్శించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అధికంగా వసూలు చేస్తే కొనుగోలుదారులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్ ను కూడా అందులోనే పేర్కొనాలని సోమవారం ఎక్సైజ్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.



దీంతో జిల్లా ఎక్సైజ్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. బెల్టుషాపులు, నాటుసారా నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉండడంతో అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. బెల్టుషాపుల నిర్మూలన కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల వారీగా ఎస్ఐ స్థాయి నుంచి ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయి అధికారుల వం"కూ ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు తమ పరిధిలోని ఏదో ఒక గ్రామంలో రాత్రి బస చేయాలని ఆదేశించారు.



దీనివల్ల గ్రామాల్లో ఎక్కడ మద్యం విక్రయిస్తున్నారు...ఎక్కడ కల్తీ మద్యం తయారవుతోందనే దానిపై సమాచారం సులభంగా వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల్లో ఎంఆర్డీలు పక్కాగా అమలు అయ్యేలా చూడాల్సిందేనని స్పష్టంచేశారు. బెల్టుషాపులపై దాడులు చేసినపుడు నిర్వాహకులతోపాటు వారికి మద్యం సరఫరా చేసిన దుకాణం లైసెన్స్ను రద్దు చేయాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు.


 



Comments