పడకంటి మనసులో మాట 31.05.2020 PART II

తెలంగాణలో మరో గ్రీన్ రివల్యూషన్



ఇక నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణా అన్న నినాదం ఎత్తుకున్న సిఎం కేసిఆర్ దీనిని నిజం చేసేందుకు ప్రాజెక్టులను జెట్ వేగంతో నిర్మిస్తున్నారు. కాళేశ్వరం, దేవాదుల పనుల వేగం చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ ప్రాజెక్టులు కూడా పూర్తి అయితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రూపు రేఖలు మారుతాయనడానికి మరెంతో దూరం లేదని గుర్తించాలి.


వ్యవసాయం పడావుపడితే ప్రజలకు అన్నపానీయాలు దొరకవు... ఆధునిక యువతకు వ్యవసాయంపై బొత్తగా అవగాహన లేకపోవడం కూడా మనకు ప్రమాదమే... ఇది తెలిసిన నేతగా సిఎం కెసిఆర్ తొలినాళ్ల నుంచే వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఆలోచనతో కార్యాచరణకు దిగారు.



రైతు అలిగితే మంచిది కాదని ఆయనకు తెలుసు. పాలకులు అన్నవారు ఇలాంటి ఆలోచనే చేయాలి. రైతులకు అలక రాకుండా.. వారు నైరాశ్యం చెందకుండా వెన్నుతట్టి ప్రోత్సహించాలి. తెలంగాణలో తజాగా తీసుకున్న నియంత్రిత సాగు విషయంలోనూ పెద్ద ఆలోచన దాగుంది.


అంతా ఒకేరకమైన పంటలు వేసి గిట్టుబాటు ధరల కోసం పోరాడే కంటే చెప్పిన పంటలను వేసి గిట్టుబాటు ధరలు దక్కించుకోవాలన్నదే కెసిఆర్ నిర్ణయంగా భావించాలి. ఇది రైతులకు మేలు చేసేదే తప్ప మరోటి కాదు. అందుకే సిఎం నియంత్రిత పంటలే తప్ప నియంతృత్వ పంటలు కావని స్పష్టం చేశారు.



ఉచితంగా విద్యుత్, నీటి సరఫరా, రైతుబంధు ద్వారా పెట్టబడి, సకాలంలో ఎరువులు విత్తనాలు అందచేయడం , రైతులకు బీమా అమలు చేయడం వంటివన్నీ విప్లవాత్మక నిర్ణయాలు తప్ప మరోటి కావు.


రైతుబంధు పథకం రైతులను నైరాశ్యంలో మనగకుండా చేసిన పనిగానే చూడాలి. వారికి అందించిన పెట్టుబడి ప్రోత్సాహకం అన్నది వారిలో భరోసా కల్పించేందుకు ఉద్దేశించినదిగానే భావించాలి. అందుకే వ్యవసాయాన్ని ప్రాథమిక స్థాయి నుంచి విద్యలో పాఠ్యాంశంగా చేర్చాలి.



అప్పుడే ప్రజలకు అవగాహన పెరుగుతుంది. బ్యంకులను ముంచినోళ్లను.. కంపెనీలు పెట్టి రుణాలు ఎగొట్టినోళ్లను చూస్తుంటే రైతులకు ఎంత చేసినా తక్కువే. వారిలో నైరాశ్యం నెలకొంటే ప్రపంచానికే ప్రమాదం.


రైతులకు కావాల్సింది సకాలంలో నీరు రావడం.. నిరంతరాయంగా విద్యుత్ అందుబాటులో ఉండడం.. పెట్టుబడి కోసం బ్యాంకులు విరవిగా రుణాలు ఇవ్వడం.. ఇవన్నీ సక్రమంగా జరిగిన తరవాత పంటలను ఎలాంటి పేచీ లుకుండా కొనుగోలు చేయడం.. ఇలా చేస్తే మన పొలాల్లో వారు బంగారాన్నే పండిస్తారు.



అందుకే రైతులు కన్నీరు పెట్టకుండా అన్ని విధాలుగా అండగఆ నిలిచారు సిఎం కెసిఆర్. ఆయన ఇచ్చి ప్రోత్సాహం ఇప్పుడు వారిలో ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.


రాష్ట్రంలోని రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలోని లేని విప్లవత్మాక మైన విధానాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.


వ్యవసాయం దండుగ అన్న నానుడి నుంచి వ్యవసాయం పండుగ అనేలా చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రతిఒక్క రైతు రుణపడి ఉంటారు.


______________________________________________________


రాజ్యాంగాన్ని విస్మరిస్తే తప్పవు ఎదురుదెబ్బలు



రాజ్యాంగానికి లోబడే నిర్ణయాలు ఉండాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ ను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్ను కొట్టివేస్తూ.. రమేశ్ ను తొలగించడమే లక్ష్యం ఆయనను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పాలకులకు కనువిప్పు కావాలి.


అలాగే ఇటీవలి కాలంలో అనేక విషయాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టేవిగా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకోలేవడం లేదని పలు సందర్భాల్లో రుజువు అయ్యింది. అందుకే తాజాగా నిమ్మగడ్డ విషయంలో రాష్ట్ర హైకోర్టు ఆర్డినెన్సును కొట్టేసింది.



నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానిక ఎన్నికల పక్రియను వాయిదా వేసినప్పుడు అధికార పార్టీకి ఆగ్రహం కలిగింది. తమకు ఇష్టం లేని విధంగా కమిషన్ నిర్ణయం తీసుకున్నందున కమిషనర్ నే మారుద్దామని ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు. ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచి నప్పటికీ పాలన మాత్రం రాజ్యాంగబద్దంగా సాగాల్సిందే.


అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా పాలన చేస్తాం అంటే కుదరదు! రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ప్రజలు ఎన్నుకున్న వారు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప నేను చెప్పిందే వేదం అన్న రీతిలో ముందుకు సాగడం కుదరదు.



కోర్టు తీర్పులను అపహాస్యం చేయడం...విమర్శించడం కూడా సరికాదు. కోర్టులు షాక్ ఇచ్చాయని వార్తలు రావడం సహజం.. వాటిని కూడా ఎద్దేవా చేసేలా మాట్లాడడం అధికార పార్టీకి తగదు. ఎపిలో ఇటీవలి కాలంలో కోర్టుల్లో అనేక విషయాల్లో వైకాపా ప్రభుత్వానికి షాకులు, లేదా మొట్టికాయలు పడ్డాయి.


ఇవన్నీ ఎందుకిలా జరిగాయో అర్థం చేసుకోవాలి. అంతేగాని తమ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టుల తీర్పులు ఉన్నాయనుకోరాదు. ఒకవేళ అలా అనుకుంటే అప్రమత్తంగా రాజ్యాంగానికి బద్దమై నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు కోర్టులు కూడా ఏమి వ్యతిరే కించవు. వ్యక్తి, ఒక వ్యవస్థ, లేదా ఒక పద్ధతి పూర్తిగా పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా మనుగడ సాగించేందుకు రాజ్యాంగం ఉంది.



అయితే దానిని కాదని ముందుకు పోతామంటే కుదరదు. రాజ్యాంగం కల్పించిన అవకాశం మేరకే ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన వారు పాలన చేయడానికే కాని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి కాదు. అంతా నా ఇష్ట ప్రకారం జరగాలన్న ధోరణి సరికాదు.


ఏదైనా తేడా వస్తే... హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు జోక్యం చేసుకుని సరిచేసుకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రాథమిక హక్కుల విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పులు ఇచ్చిన సందార్భాలు కూడా అనేకం ఉన్నాయి.



చట్టాలు రూపొందించే, వాటిని అమలుచేసే పరిపాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ...ఈ మూడూ వేటికవే స్వతంత్రంగా పనిచేసేలా రాజ్యంగం లో రాసుకున్నాం.ఒకదానికంటే ఒకటి తక్కువగా ఏర్పాటుచేయలేదు.


ఈ ఏర్పాటువల్లే తాత్కాలిక అన్యాయం జరిగినా... మళ్లీ మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేందుకు ఆస్కారం ఏర్పడింది. అధికారంలో ఉన్న పార్టీలు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుని, దబాయిస్తామంటే కుదరదు.



చట్టసభలు చట్టాలు చేస్తాయి. అవి న్యాయానికి, రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా? లేదా? అని చూసే బాధ్యత న్యాయస్థానాలది. అదేవిధంగా చట్టాలను అమలుచేసే బాధ్యతను రాజ్యాంగం పాలనా యంత్రాంగానికి అప్పగించింది.


చట్టాలను చేసిన వారే వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కుతామంటే కుదరదు. ఈ ప్రభుత్వం మాది. ప్రజలు మాకు 151 సీట్లు ఇచ్చారు.



ఎన్నికల కమిషనరే నిర్ణయాలు తీసుకుంటే ఇక మేమెందుకు? పాలించేది మేమా.... ఆయనా అని చేసిన వ్యాఖ్యలు అహంకాపూరితంగా ఉన్నాయే తప్ప మరోటి కాదు. ఇకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే అమలు జరుగుతాయి.


అయితే, ఆ నిర్ణయాలు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉండాలి. అలా జరగనప్పుడు అభ్యంతర పెట్టవలసిన బాధ్యత అఖిల భారత సర్వీస్ అధికారులపై ఉంటుంది. విధి నిర్వహణలో నిబంధనలు, ధర్మాన్ని, చట్టాన్ని పాటించని పక్షంలో ఏమిజరగాలో ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది.



శుక్రవారంనాడు హైకోర్టు ఇచ్చిన రెండు కీలక తీర్పులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తలవంపుగా మారాయి. అలాగే సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు నమోదయ్యాయి.


పలువురికి నోటీసులు ఇచ్చారు. హైకోర్టును, జడ్జిలను నిందిస్తూ పెట్టిన పోస్టులు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది.ఓ ఎంపి దారుణంగా వ్యాఖ్యలు చేయడం సహించరానిది.


________________________________________________________


CLICK ME FOR PART I


For more updates:


Follow us on Facebook:  https://www.facebook.com/padakanti9/


Join our Facebook group: https://www.facebook.com/groups/538636313431680/?ref=share


Follow us on Instagram:


https://instagram.com/news9.india?igshid=1vrlidszjnziz


                         Stay Home Stay Safe 


Comments